Featured News

తాంబూలాలు ఇచ్చాము. తన్నుకు చావండి.

తాంబూలాలు ఇచ్చాము. తన్నుకు చావండి.

నాకైతే పార్లమెంట్ లో నిన్న చిదంబరం గారు చేసిన ప్రకటన చూస్తే అలాగే అనిపించింది. తెలంగాణా పై జరిగిన చర్చకు కు సమాధానమిస్తూ రాష్ట్ర విభజన విషయం లో కేంద్రం కేవలం సంధాన కర్త మాత్రమే, నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు మాత్రమే అని అన్నారు. ఏకాభిప్రాయానికి రావలసింది రాష్ట్రం లో రాజకీయ పార్టీలే, నిర్ణయం తీసుకుంటే కేంద్రం అమలు పరుస్తుంది అన్నారు. రాష్ట్రం లో ఏకాభిప్రాయం మృగ్యమై ప్రతి రాజకీయ పార్టీ రెండు గా చీలి తన్నుకుంటున్న వేళ ఏకాభిప్రాయం తీసుకురండి మేము అమలు చేస్తాము అనడం సమస్య ను సాగదీసే, రాష్ట్ర ప్రయోజనాలను అస్సలు పట్టించుకోని ధోరణి తప్ప మరేమిటి? అసలు ఏకాభిప్రాయం ఉంటే పార్లమెంట్ లో సావధాన తీర్మానం, దానిపై చర్చ ఉండేదా?

చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత రాష్ట్రం లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్ని రాజకీయ పక్షాలు ఉద్యమ బాట పట్టాయి. కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు చదువు సంధ్యలు వదిలేసి ఉద్యమం అంటున్నారు. విశ్వ విద్యాలయాలు రణభూములుగా మారాయి. ఆత్మ హత్యలు ఆయుధాలు అయ్యాయి. ఈ మధ్యలోనే జగన్ పార్టీ రావడం, చిరు పార్టీ పోవడం రాజకీయ సమీకరణాలు మారడం రాష్ట్రం లో మారిన పరిస్థుతులకు అద్దం పడుతున్నాయి. ఈ నేపధ్యం లో రాష్ట్రం లో పారిశ్రామీకరణ పూర్తిగా మందగించిన విషయం ఎవరు పట్టించుకోలేదు. చదువుకోవాలని ఉన్న సమ్మెల వాళ్ళ చదువుకోలేక మేమేం తప్పు చేసాము అని బాధ పడే విద్యార్థుల గోడు ఎవరు పట్టించుకోలేదు. రోజు కో బంద్, పూటకో సమ్మె పేరుతో రొట్టి నోటికి అంధక ఏడ్చే బీదవాడి బాధ ఎవరికీ పట్టలేదు. ఒక్కపుడు దేశం లోనే పెట్టుబడులకు ప్రిఫర్డ్ డెస్టినేషన్ అనిపించుకున్న హైదరాబాద్ నగరం ఈ రోజు పెట్టుబడుదారుల ఫేవరేట్ కాదు. తెలంగాణా ఎం ఎల్ ఏ లు ఎం పీ లు రాజీనామా చేసారు. తెలంగాణా పేరు మీద డెల్లి లో ఒక చావు సంభవించింది. ఇలాంటి పరిస్థుతులలో ఏదో ఒక నిర్ణయం వస్తే చాలు అని రాష్ట్రం లో మెజారిటీ ప్రజలు కేంద్రం వైపు చూస్తున్న
తరుణం లో చిదంబరం నుండి ఎవరు ఇలాంటి ప్రకటన ఎదురుచూడలేదు. రాష్ట్ర పరిస్థుతుల పట్ల, రాష్ట్రం పట్ల కేంద్ర నాయకత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు ఈ ప్రకటన తెలియచేస్తుంది.

అయ్యా చిదంబరం గారు, ఇక్కడ మీ నిర్ణయం తీసుకోవాల్సిన మీ ముఖ్యమంత్రేమో నాదేమి లేదు. కేంద్రం ఏమి చెపితే అదే అంటారు. ఇక మీరేమో మీరే నిర్ణయించుకోండి అంటారు. మీ పార్టీ లోనే రెండు గ్రూప్లు తయారు అయ్యి ఒకరిని ఒకరు తిట్టుకుంటుంటే, సమస్య జటిలం చేస్తుంటే ఒక లీడర్ గా నోరు ముయ్యంద్రా…ఇది మన పార్టీ బాట అని వారిని ఒక దారికి తీసుకొని రారు. మరి ఏమిటండి మీరు, మీ పార్టీ కేంద్ర నాయకత్వం చేస్తోంది? ఉదాహరణ కు ఇద్దరు సోదరులు ఉన్నారనుకోండి. ఇద్దరు ఆస్తి గురించి గొడవపడి చంపుకునేందుకు కత్తు దూసి పరిష్కారం కోసం తండ్రి దగ్గరికి వెళితే ఆ తండ్రి శాంతి పూర్వకం గా కూచొని చర్చించుకొని ఒక పరిష్కారం తో నా దగ్గరికి రండి అంటే నవ్వు రాదా? మాకే నిర్ణయం తీసుకునే కామన్ సెన్స్ ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాము? అయిన తెలంగాణా సమస్య కు జవాబు మా దగ్గరే ఉంది అని మీరు అనుకుంటే డిసెంబర్ తొమ్మిదిన ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఎందుకు అర్ధరాత్రి ప్రకటన చేసి నాలిక కర్చుకున్నారు ? ఎందుకు శ్రీ కృష్ణ కమిషన్ వేసారు? ఆ మాట అంటే డిసెంబర్ తొమ్మిది ప్రకటన గురించి నన్ను ఏమి అనొద్దు . అది నా ఒక్కడి ప్రకటన కాదు. మా కాబినెట్ ప్రకటన అంటారు. మీరు చిదంబరం గా ఆ ప్రకటన చేసి ఉంటే ఎవరు ఏమి అనేవారు కాదు. కాని మీరు మాట్లాడింది ఒక హోం మంత్రి గా అని హోం మంత్రి కాబినెట్ లో భాగం అని అందరికి తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. సమస్య పరిష్కరించాల్సిన సమయం లో సమస్య నుండి పారిపోవడం ఏమి నాయకత్వ లక్షణం అని అడుగుతున్నాను. ఈ సమయం లో ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు కోరుతున్నది పలాయన వాదం కాదు. చాచివేత ధోరణి కాదు. మాకు కావాల్సింది పరిష్కారం మాత్రమే. అగ్గి రాజేసి మంటలు ఆర్పేందుకు నీళ్ళు ఇవ్వండి అంటే నా దగ్గర లేవు, మీరే ఒక భావి తవ్వుకోండి అంటే అది ఏమి మాట? ముందు మీ పార్టీ లో ఉన్న రెండు వర్గాలను ఒక నిర్ణయం తో ఒక దారికి తెండి. మీ ముఖ్యమంత్రి ని డిల్లి వైపు చూడకుండా నిర్ణయాత్మకంగా ఉండేలా చూడండి. ఆ పైన అందరిని పిలిచి ఈ తేది లోగా మీరంతా కూచొని ఒక నిర్ణయం తీసుకోండి లేదంటే మేము డిసైడ్ చేతము. దాని తల ఊపండి అని ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. తెలంగాణా అయినా, ఆంధ్ర ప్రదేశ్ అయినా ఇండియా లోనే బాగం కదా !

ఒక చిన్న మాట- మాజీ సీఎం రోశయ్య గారు నిన్న కొత్త మంత్రం వేసారు. సోనియా గాంధీ ఆరోగ్యం దృష్ట్యా తెలంగాణా పై ఆందోళన కాస్త వాయిదా వెయ్యండి అని. అయ్యా రోశయ్య గారు. తెలంగాణా పై నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వమా..సోనియా గాంధీ నా? మరి నిర్ణయం అమ్మది అయితే సింగ్ గారు ఏమి చేస్తారు. లేదంటే మీరు పవర్ అంత అమ్మదే… సింగ్ గారు కేవలం కీలు బొమ్మ అని అందరు అనుకునేది నిజం అని రుజువు చేస్తున్నారా? ఈ రోజు అమ్మ ఆరోగ్యం బాలేదు అంటారు, రేపు రాహుల్ పెళ్లి అంటారు. ఇక్కడ జనం తన్నుకు చస్తున్నారు. ఆ విషయం మీకు కనబడుతోందా అసలు?

by Brahma Mahesh
khaderbad@gmail.com


Comments are closed.