మేధావులు, విద్యార్ధులు, రాజకీయనాయకులు, ఉద్యమ నాయకులకు ఒక ప్రశ్న

మేధావులు, విద్యార్ధులు, రాజకీయనాయకులు, ఉద్యమ నాయకులకు ఒక ప్రశ్న

తెలంగాణా కోసం 600 మంది విద్యార్థులు మరణించారు- మేధావులు, విద్యార్ధులు, రాజకీయనాయకులు, ఉద్యమ నాయకులకు ఒక ప్రశ్న

గత రెండు రోజులలో తెలంగాణా కు చెందిన రాజకీయ నాయకులు ట్యాంక్ బండ్ పై విగ్రహాల విధ్వంసాన్ని సమర్ధించుకుంటూ తెలంగాణా కోసం ఆరు వందల మంది విద్యార్థులు చనిపోతే ఎవ్వరు బాధపడలేదు కాని ప్రాణం లేని విగ్రహాల కోసం బాధ పడతారా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల గురించి తెలియదు కాని ఏ కారణం వాళ్ల కాని చనిపోయిన ప్రతి విద్యార్ధి మరణం ఈ రాష్ట్రం లో హృదయం ఉన్న ప్రతి మనిషి కి కరిగించింది అన్నది వాస్తవం. తెలంగాణా కానివ్వండి, ఆంధ్రా కానివ్వండి, రాయలసీమ కానివ్వండి ప్రతి తెలుగు వాడు బాధపడ్డాడు. ఇది సత్యం. ఈ సందర్భంగా విద్యార్ధి లోకానికి, మేధావులకు నా తరపు నుండి ఒక్క ప్రశ్న.దయచేసి సమాధానం ఇవ్వగలరా?

తెలంగాణా కోసం ఇంత మంది అభం శుభం తెలియని ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మరణించారు కాని తెలంగాణా ఉద్యమం కోసం ప్రాణాలైనా ఇస్తాం, తెలంగాణా తెస్తాం అని వేదికలు ఎక్కి, బాషణలు ఇచ్చే రాజకీయనాయకులు, వారికి జేజేలు పలికే అనుచరులు కాని ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు మరణించలేదు? మరణించడం పక్కన పెట్టండి, ఒక్కరికి కూడా ఒక్క గాయం అయినా అయ్యిందా? ఎందుకు? ఉద్యమం కోసం ప్రాణాలు ఇచ్చేది విద్యార్థులు, పదవులు మాత్రం నాయకులకా..ఇదెక్కడి న్యాయం?

మళ్లీ చెప్తున్నాను. నేను తెలంగాణా కు కాని, ఉద్యమానికి కాని వ్యతిరేకం కాదు. భారతదేశం నుండి విడిపోనంతవరకు ఎన్ని రాష్ట్రాలైనా పరవాలేదనేది నా అభిప్రాయం. నా సమస్య అంతా స్వార్ధ రాజకీయాలు మాత్రమే. అంత ఉద్యమకారులయితే ఏ ఒక్క చోట కూడా ఏ రాజకీయనాయకుడికి ఎందుకు ఒక్క దెబ్బ కూడా తగలలేదు? ఎందుకు ఒక్క నాయకుడు కూడా ప్రాణాలు ఇవ్వలేదు? ఈ మధ్య జరిగిన మిలియన్ మార్చ్ లో కూడా ట్యాంక్ బండ్ పై విద్యార్థులే కనిపించారు కాని ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనిపించలేదు. తమ భవిష్యత్తు ను చదువు ను ఉద్యమం కోసం బలి చేస్తున్న విద్యార్థుల గురించి ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణా కోసం మరణించిన ఆ 600 విద్యార్థుల కుటుంబాల కోసం నాయకులు ఏమి చేసారు? కష్టపడి పెంచుకున్న పిల్లలు, చెట్టంత ఎదిగి కష్టం తీర్చాల్సిన పిల్లలు మరణిస్తే గుండెపగిలి బాధ పడుతున్న ఆ తల్లితండ్రుల కోసం నాయకులు ఏమి చేసారు? కనీసం వాళ్ల పేర్లన్నా ఈ నాయకులకు తెలుసా? మేధావులు రాజకీయనాయకులను ఈ విషయాల పై ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆచార్యుడైన కోదండరామ్ గారు విద్యార్థుల గురించి ఎందుకు ఉద్యమించడం లేదు? విద్యార్థుల మరణాలను కూడా తమ రాజకీయాలు వాడుకుంటున్న రాజకీయనాయకులకు సమాధానం ఎవరు చెపుతారు. నా ప్రశ్న చదివి సీమంద్రుల కుట్ర ని అనుకుంటే నేను సమాధానం చెప్పలేను ఎందుకంటే నేను సీమాంధ్ర వాడినో, తెలంగాణా వాడినో కాదు. నేను కేవలం భారతీయుడిని. నేను మానవతా వాదిని మాత్రమే.

by Brahma Mahesh
[email protected]


Comments are closed.