Featured News

విశ్వరూపం లో ఏం ఉంది?

విశ్వరూపం లో ఏం ఉంది?

విశ్వరూపంలో ఏముంది. ఎందుకింత వివాదం అవుతోంది. నిజంగానే ముస్లింల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందా? లేకపోతే ఇదంతా కేవలం రాజకీయ క్రీడలో భాగంగా జరుగుతున్నదా? కమల్ వాదనలో నిజమెంత? జయ లలిత వివరణలో వాస్తవమెంత? ఇవీ ఇప్పుడు జనాన్ని వేధిస్తున్న ప్రశ్నలు.

కమల్ హసన్ విశ్వరూపంలో ప్రధానంగా చెప్పిన విషయం ఏమిటి. అమెరికా వర్సస్ అల్ ఖైదా. అమెరికాను టార్గెట్ చేస్తూ అల్ ఖైదా రూపొందించిన వ్యూహం ..రేడియేషన్ వ్యాప్తి చేసే గోళాలను పావురాల ద్వారా అమెరికా అంతా స్ప్రెడ్ చేయడం అనే ఒక తరహా బయోవార్ కు సిద్దపడడం. దాన్ని ఇండియాకు చెందిన రా అధికారి ఛేదించి అమెరికాను కాపాడడడం. అదీ కథ.

అమెరికా వర్సస్ అల్ ఖైదా ఈ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో సినిమాలు రావచ్చు…రాంబో తరహా సినిమాలూ రావచ్చు. కానీ భారతదేశం నుంచి రియలిస్టిక్ అప్రోచ్ తో ఈ తరహా సినిమా నిర్మించడం ఆశ్చర్యకరమే.

ఇంతకీ ఈ సినిమాలో కమల్ హసన్ పాత్రేమిటి? రా ఏజంటుగా అల్ ఖైదాలోకి వెళ్లిన ఓ ముస్లిం కుర్రాడి పాత్ర. అల్ ఖైదాకు తర్ఫీదు కూడా ఇస్తాడు. ఆ సమయంలో ఆఫ్ఘన్ లో తాలిబన్ల కుటుంబాల్లోని పరిస్ధితులను గమనిస్తాడు. పిల్లలు చదువుకోవాలనుకునే తల్లులు…తుపాకులకు దూరంగా హాయిగా జీవించాలని కోరుకునే పిల్లలను చూస్తాడు.

అదే సమయంలో కరడు కట్టిన ఉగ్రవాదుల ఘర్షణనూ చూస్తాడు. ఆశయం కోసం కుటుంబాల్ని సైతం పోగొట్టుకుంటున్న వారి త్యాగాల్ని కూడా చూపిస్తాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ కు కమల్ హసన్ వెళ్లిన పనేమిటి? తాలిబన్ల చేతుల్లో బంధీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం.

అమెరికా వర్సస్ అల్ ఖైదా అంశం మీద లోతుగా అధ్యయనం చేసిన వాళ్లు ఈ సినిమాతో ఏ మాత్రం ఏకీభవించరు. ఇందులో కమల్ హసనే చెప్పినట్టు నేను విలన్ ని నేను హీరోని. అనే డైలాగ్ మాత్రం చాలా చాలా వాస్తవం. అమెరికా కోసం రెండు సాహసోపేత ఆపరేషన్లు చేసిన రా ఏజంట్ గా కమల్ హసన్ కొంత మందికి హీరోలా కనిపించవచ్చు. అదే సమయంలో అమెరికా కోసం ముస్లిం యువకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసే రా ఏజంట్ గా ఇంకొంత మందికి కమల్ హసన్ విలన్ లానూ కనిపిస్తాడు.

చిత్రంలో స్పష్టత కరువైన సీరియస్ డైలాగ్స్ కొన్ని వినిపిస్తాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ లో ఒక మహిళ ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్లొచ్చారు. ఆ తర్వాత రష్యన్లు వచ్చారు. ఆ తర్వాత అమెరికా వాళ్లొచ్చారు. తాలిబన్లు వచ్చారు అంటుంది. ఈ డైలాగ్ ఒక పోరాట ప్రాంతానికి చెందిన పాత్ర తో చెప్పించడం మధ్యతరగతి వారికి నచ్చుతుంది.

నక్సలైట్లకీ పోలీసులకీ మధ్య ప్రజలు నలిగిపోతున్నారని అంటే…అది నిజమే అనుకునే జనమూ ఉంటారు. అబద్దం అని బలంగా నమ్మే జనమూ ఉంటారు. పైగా అదే మాటను ఓ ఆదివాసీతో అనిపిస్తే…దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. విశ్వరూపంలో కమల్ ఈ కోణంలో అమెరికాకు అనుకూలంగా వ్యవహరించారనే మాట సినిమా చూసిన కొందరు చెప్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లో ఓ సందర్భంలో ఓ డాక్టర్ అవుతానని చెప్పే ఓ పదేళ్ల కుర్రాడిని కమల్ హసన్ ఉయ్యాలూపుతానంటాడు. నేనేం అంత చిన్న వాణ్ణి కాదని వెళ్లిపోతాడు వాడు. ఓ పద్దెనిమిదేళ్ల యువ తాలిబన్ మాత్రం ఉయ్యాల మీద కూర్చుని కమల్ హసన్ ను ఊపమని అడుగుతాడు. ఈ సీన్ కొందరికి తాలిబన్లలోకి వెళ్లిన కుర్రాళ్ల బుర్రలు ఎదగవని చెప్పినట్టుగా అర్ధం అయింది. కానీ ఇంకొందరికి పోరాటంలో ఉన్నా…రొమాంటిక్ నేచర్ పోదని చెప్పడంగా అర్ధమైంది .

మొత్తంగా సినిమా అంతా ప్రో అమెరికన్ స్టైల్ లో నడిచిందనేది కాదనలేని వాస్తవం. హీరో అమెరికా తరపున వ్యవహరించడం చాలా ప్రాంతాల్లో కాస్త ఆలోచించగలిగే ముస్లింలకు జీర్ణం కావడం లేదు.

ఇక ఇంకొందరి వాదన ప్రకారం విశ్వరూపం లాంటి సినిమాలు ముస్లింల మీద అనుమానాలు పెంచేవిగా మారతాయి. సినిమా ధియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఎవరైనా ముస్లిం ఎందురైతే…అతని చేతిలో ఏ సంచీయో ఉంటే…అందులో ఏ ముందో అనే భయం కలిగించేదిగా ఈ సినిమా ఉందనేది వారి వాదన.

ఉగ్రవాదం మీద వచ్చే ప్రతి సినిమా చేసే పని అదే. ఇలాంటి సినిమాలు వేరే భాషల్లో వస్తే అది వేరు. నేరుగా మనకు బాగా తెల్సిన యాక్టర్లు…నటించిన సినిమాల్లో వచ్చేస్తే…ఆ భయం రెట్టింపు అవుతుంది. కమల్ విశ్వరూపం కాన్షస్ గా కానీ అన్ కాన్షస్ గాగానీ…చేసే పని అదే అనేది మేధావి వర్గం ఆరోపణ.

అయితే…కమల్ ఇవన్నీ ఊహించి ఉండడా? ఉండచ్చు…రీసెర్చి కూడా చేసి ఉండవచ్చు. అయితే…ఆయన లక్ష్యం హాలీవుడ్ లెవెల్లో సినిమా చేయడం. దానికి తగ్గ కథాంశంగా ఉగ్రవాదాన్ని ఎంచుకుని ఉంటారు. అందులో ప్రో అమెరికాగా వెళ్లడం…కొంత సేఫ్ అనుకుని ఉండవచ్చు. అయితే హాలీవుడ్ వాళ్లే సినిమా తీస్తే…పట్టించుకో నిరాకరించే కొన్ని అంశాల్ని కమల్ పట్టించుకున్నాడు. ఉదాహరణకు తాలిబన్ల జాడ తెలిపే పరికరం ఓ ఆఫ్ఘన్ షేక్ దగ్గర దొరికిన సందర్భంలో తను గిల్టీగా ఫీలవుతాడు. ఈ సీన్ హాలీవుడ్ వాళ్లే తీస్తే ఉండకపోవచ్చు.

హీరో పాత్రను ముస్లింను చేయడం…ఒక ముస్లిం హీరోతోనే జీహాదీలను మట్టుపెట్టించడం అనే టెక్నిక్ చాలా బ్యాడ్ ఇంపాక్ట్ వేస్తుందని కమల్ హసన్ ఎందుకు గుర్తించలేదనే మాట కూడా వినిపిస్తోంది. సినిమాలో ఏముంది…హీరో విలన్లను మట్టుపెట్టడం…అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడకపోవడం…బానే ఉంది కదా అనిపిస్తుంది. పైగా ఆ విలన్లు మామూలు వాళ్లా…మతం పేరుతో ఉన్మాదాన్ని నింపేవాళ్లు…కాంప్లెక్సులు పేల్చేసేవాళ్లు. ఎటువంటి వినాశనాన్నైనా చేయడానికి వెనుకాడని వాళ్లు. అలాంటి విలన్లను చంపేయడం తప్పేముంది? అనుకునేవాళ్లూ ఉండచ్చు.

కమల్ హసన్ సెక్యులర్ నినాదాన్ని ఎందుకంత బలంగా ఎత్తుకున్నాడు. సెక్యులర్ అనిపించుకోవాలంటే…ఒక మతాన్ని గురించి ఏం చెప్పినా…నోరుమూసుకుని ఉండడమా? సెక్యులర్ పేరుతో ముస్లింలను మాట్లాడద్దని కట్టడి చేస్తున్న కమల్ హసన్ అమెరికా చేస్తున్న అరాచకాల మీద కూడా బలంగా మాట్లాడాలి కదా…అనే మాట కూడా వినిపిస్తోంది.

కమల్ హసన్ సెక్యులర్ ప్రాంతానికి తరలివెళ్లిపోతానని అనడం…నిన్ను తమిళనాడు నుంచి పంపేయడానికే నీకు ఉలగనాయకన్ బిరుదిచ్చారని ఆయన సోదరుడు వంత పాడడం అంతా…ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేయడంలా అనిపిస్తోందనే వాదనా ఉంది. కమల్ వెళ్లిపోతే రేషన్ కార్టులిచ్చేసి మేమూ వెళ్లిపోతాం అని ఆయన ఫాన్స్ అంటున్నారు. ఇదంతా ఒక ఉద్రేకంలో చేసే ప్రకటనలుగా కొట్టిపారేస్తున్నారు.

ఇక పంచెకట్టు తమిళియన్ ను ప్రధానిగా చూడాలనుకుంటున్నానని కమల్ హసన్ ఆ మధ్య చేసిన ఒక ప్రకటనే ఈ సినిమాకు కష్టాలు తెచ్చిపెట్టిందని కరుణానిధి అనడం ఫక్తు రాజకీయంగా జనం చెప్పుకుంటున్నారు. జయలలిత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి దొరికిన ఏ అవకాశాన్నీ ఆయన వదులుకోడానికి సిద్దంగా లేరు. కమల్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. నిజానికి కమల్ విశ్వరూపం డీటీహెచ్ రైట్స్ కూడా కరుణానిధి వర్గానికి చెందిన ఆపరేటర్ కే ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారానికి ఈ మాట ఊతం ఇస్తోందనే విమర్శ వినిపిస్తోంది.

విశ్వరూపం డీటిహెచ్ రైట్స్ ఎఐడిఎంకేకు మద్దతుగా నిల్చే ఛానల్స్ కు ఇవ్వకపోవడం వల్లే జయ ప్రభుత్వం విషయాన్ని సీరియస్ చేస్తోందని కమల్ హసన్ అన్యాపదేశంగా ఆరోపించారు. ఆయన మద్దతుదార్లు ఓపెన్ కామెంట్స్ విసిరారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ…జయలలిత ప్రెస్ మీట్ పెట్టారు. ఖండించారు. బ్యాన్ పెట్టడాన్ని సమర్ధించుకున్నారు. శాంతి భద్రతల సమస్యగా మాత్రమే మాట్లాడి మిగిలిన అంశాలన్నీ రాజకీయాలని కొట్టిపారేశారు.

దాదాపు కమల్ హసన్ స్టైల్ లోనే చాలా సందేహాలకు అవకాశం ఇచ్చేలాగానే జయలలిత ప్రకటన సాగింది. కమల్ హసన్ కావాలని రాద్దాంతం చేస్తున్నారని ఏమీ సినిమా ఎంత వ్యాపారం చేస్తుందో…ఎలాంటి వివాదాలను సృష్టిస్తుందో ఇవన్నీ ఆలోచించకపోవడం ఆయన తప్పు మాకేం సంబంధం అని జయలలిత చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పేశారు.

ప్రపంచ వ్యాప్త ఆడియన్స్ ను టార్గెట్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సమస్యను కథాంశంగా తీసుకుని దాన్ని రియలిస్టిక్ గా తీయడానికి బోల్డు బడ్జట్ పెట్టి భారీ సెట్స్ వేసి హాలీవుడ్ లెవెల్లో సినిమా తీయడంలో మాత్రం కమల్ హసన్ నూటికి నూరు శాతం విజయం సాధించారు. అందులో ఎవరికీ ఏ సందేహమూ అవసరం లేదు. చిత్రంలో ప్రతి ఒక్క శాఖా అద్భుతంగా పనిచేసింది. నటులందరూ చాలా చాలా గొప్పగా నటించారు.

కమల్ అభిమానులు మాత్రం కమల్ ఎంటర్ టైనింగ్ సినిమాలు చేస్తే బాగుంటుంది కదా…అని కోరుకుంటున్నారు. ప్రయోగాల పేరుతో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు మహానటుడు అని ఇంకొందరు బాధపడుతున్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా కమల్ వెనుకాడరని ఆయన వ్యతిరేక వర్గం కూడా బలంగా ప్రచారం చేస్తోంది. మరి లోకనాయకుడు ఈ వివాదాలనుంచి ఎలా బయటపడతాడో కాలమే చెప్పాలి.

bharadwaja rangavajhala

Click Here to More Viswaroopam Movie


Comments are closed.