Featured News

హైద్రాబాద్ లో బాంబులు….రివేంజ్ డ్రామా….

హైద్రాబాద్ లో బాంబులు....రివేంజ్ డ్రామా....

ప్రతీకార పరంపరలో మరో పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు. అపకారికి ఉపకారము చేయమని సుమతీశతకకారుడు చెప్పాడు. అంటే మనకు బెల్లం పెట్టిన వాడికి బెల్లం పెట్టడం కాదు. మనకు అల్లం పెట్టిన వాడికి కూడా బెల్లం పెట్టడం. పశ్చాత్తాపం , క్షమ గురించి మన మతాలు, మనమూ రోజూ చాలా సార్లు మాట్లాడుకుంటాం. కానీ ఆచరణలో మాత్రం ప్రతీకారమే జీవన విధానంగా సాగిపోతూంటాం. రివేంజ్ డ్రామాకే సేలబులిటీ ఉంది. బెస్ట్ రివేంజ్ డ్రామా ప్లేయర్ నే మనం ఢిల్లీ గద్దెమీద కూర్చోపెట్టడానికి ఉత్సాహపడుతున్నాం. కనుక ఈ హత్యలకు త్వరలోనే ప్రతీకారం జరిగి తీరుతుంది.

ఎదుటివాళ్లను చంపడం ద్వారా కొనితెచ్చుకునేది నీ చావేరా అని మన గ్రామాల్లో పెద్దోళ్లు ఓ సామెత చెప్తూంటారు. అఫ్ఘల్ గురును ఉరితీసినప్పుడు….కసబ్ ను ఉరి తీసినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం…మిఠాయిలు పంచుకోవడం…ప్రతీకారేచ్చను రెచ్చగొట్టడమే అని అనిపించలేదు. ముంబై దాడుల్లో చనిపోయిన వారి ఆత్మశాంతికి, పార్లమెంట్ మీద జరిగిన దాడిలో చనిపోయిన వారి ఆత్మశాంతికి ఆ రెండు ఉరులు జరిగి తీరాల్సిన పనులుగా భావించాం మనం. ఆ భావన బలంగా మనలో నింపేసి మనం పండగ చేసుకునే పరిస్ధితి కల్పించుకున్నాం .

ఇలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ల సంఖ్య గణనీయంగా ఉండడం వల్లే వాళ్లను తృప్తి పరచడం మీదనే తమ రాజకీయమనుగడ ఉంటుందని తెల్సిన పాలకవర్గాలు ఈ ప్రతీకార హత్యాకాండను నిస్సిగ్గుగా కొనసాగిస్తాయి. శాడిస్టిక్ ఆనందాన్ని ప్రజల్లో నింపుతూంటాయి. క్షమకు మారురూపమైన ఏసును నమ్మే అమెరికా అయినా…అహింస ప్రతిపాదించిన గాంధీ పుట్టిన భారత్ లో కావచ్చు…ఎక్కడైనా నడుస్తోంది రివేంజ్ డ్రామాలే. అది హిట్ ఫార్ములా కాబట్టే కసబ్ ను, అఫ్జల్ గురును ఉరితీశారు.

నీ వలె నీ పొరుగువాడ్ని ప్రేమించి ఉంటే…ట్విన్ టివర్స్ పేలేవి కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నట్టు జవహర్ లాల్ నెహ్రూ నేర్పించిన రాజకీయ పాఠాలు గాంధీ గారి స్పూర్తిని చంపేశాయి. గాడ్సే ని ఉరితీసి ఈ విధంగా సిగ్నల్ ఇచ్చారు నెహ్రూ. చిన్న నేరానికైనా పెద్ద శిక్ష ఉండాలి. క్షమ అనేది కుదరదు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. మీ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగను మీరు చంపేయండి. కేసు లేకుండా మేం చూసుకుంటాం అన్నాడా మధ్య ఓ ప్రజాస్వామ్య పోలీసు. ఆయన స్టేట్ మెంట్ ను విస్తృత ప్రజానీకం స్వాగతించింది. అంతగా రివేంజ్ డ్రామా మనకు ఎక్కేసింది.

కసబ్ ను ఉరితీసినప్పుడు టీవీచానల్స్ వారు నిర్వహించిన ప్రముఖుల ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నప్పుడు నాకు భలే భయం వేసింది. ఉరి శిక్షే తప్పు లాంటి వాదనలు చేసేవాళ్లు దయచేసి నాలుగురోజులు మాట్లాడకుండా ఉంటే మంచిది. కసబ్ ఉరి జాతి మొత్తం ఎన్నో ఏళ్లుగా కోరుకుంటోన్న పని . అది జరిగినందుకు జాతి మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోంది. అలాంటి సందర్భంలో ఉరి తప్పు లాంటి చెత్త ఆర్గ్యుమెంట్స్ చేయకండని ఓ రాజకీయ నాయకుడు ఫోన్
ఇన్ ఇస్తూనే వార్నింగ్ ఇచ్చాడు. అమ్మో అనుకున్నాను నేను అసంకల్పితంగానే.

అదీ పరిస్ధితి. ఆ వార్నింగ్ వినగానే ఒక్కసారి భయం వేసింది. నేను మా ఇంట్లో ఉన్నట్టు అనిపించలేదు. పోలీస్ లాకప్ లో ఎఫ్ఐఆర్ రాయబడని స్థితిలో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఏ క్షణంలో అయినా నన్ను కాల్చిచంపేయవచ్చు అనిపించింది. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి…అనే
నమ్మకాన్ని ప్రజల్లో సిస్టమేటిగ్గా పెంచుకుంటూ వెళ్లాయి పాలకవర్గాలు. క్షమించడమా…ఇంకేమన్నానా…చంపేయాలి….వాడు మాత్రం జనాన్ని పేస్తాడా?

మనం మాత్రం వాణ్ణి ఉరితీయకూడదా? చంపేయాలి…వాణ్ణి జైల్లో ఉంచి ఏళ్లకేళ్లు ఇంతింత ఖర్చుపెట్టి …ఇదంతా ఏమిటి? చంపేయాలి అని దేశంలో మెజార్టీ
జనం అభిప్రాయపడేలా తర్ఫీదు ఇచ్చారు.

మీడియా కూడా ఫలానా నేరస్తుడు జైల్లో ఇంత తింటున్నాడు. ఇన్ని సార్లు కోర్టుకు వెళ్లాడు. ఇంత మంది పోలీసులు వాడికి కాపలా ఉన్నారు. వీటన్నిటికీ
కలిపి ఇంత ఖర్చు…అని ఉన్నంతలో బానే తర్ఫీదు ఇచ్చింది. జనాన్ని చంపేసే వాళ్ల మీద ఇంత ఇన్వెస్ట్ మెంటేమిటి? అని చిరాకు పడడం నేర్చించింది.
ప్రతీకారేచ్చను ప్రజలందరిలోనూ రేపి….ఆ వెలుగు లో చంపేసింది. రివేంజ్ డ్రామా సక్సస్ ఫుల్ ఫార్ములా అని ప్రూవ్ చేసింది.

సినిమాల్లోనూ మేం మీకు ఇంత చేశాంరా…మా దేశంలో మీ వాడు రాష్ట్రపతి అయ్యాడ్రా. మీ దేశంలో మావాడికి అలా అయ్యే అవకాశం ఉందారా? అలాంటి మా దేశంలో మీరు విధ్వంసాలు సృష్టిస్తార్రా…ఒక్కక్షణం మేం విచక్షణ పక్కన పెట్టి నిలబడితే…మీరెక్కడుంటారో తెల్సారా లాంటి డైలాగ్స్ కు సూపర్రెస్పాన్స్ వస్తుంది. మనకు ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది మరి. రివేంజ్ డ్రామా….

దొడ్లో పండే పంటకు తగిన బేరం తెచ్చుకుని అమ్ముకునే స్వేచ్చ ఎవడికీ లేదు. మా దేశ సహజ సంపద మీద సర్వ హక్కులూ మావే…మేం ఈ రేటుకైతేనే విక్రయిస్తాం లాంటి ఆంక్షలు ఏ దేశమైనా ప్రకటిస్తే…దాన్ని అంగీకరించదు పెట్టుబడి. మమ్మల్ని మేం పాలించుకుంటాం. మా మీద మీ అజమాయిషీ కుదరదు అని ఏ ప్రాంతం వాళ్లన్నా అంటే…తక్షణం ముందుకు వచ్చి అలా ఎలా కుదురుతుందని నిలదీస్తుంది పెట్టుబడి. ఒక ప్రాంతం ప్రజలకు వ్యతిరేకంగా మరో ప్రాంత ప్రజల అభిప్రాయాలను తయారు చేయడం. ఒక మతం వారికి వ్యతిరేకంగా మిగిలిన మతాల వారి అభిప్రాయాలను తయారు చేయడం. ఇలా ఒపీనియన్స్ మాన్యుఫాక్చరింగ్ జరిగిపోతుంది.

అణచివేతకు గురైన వాడు రియాక్ట్ అయ్యే విధానం కాస్త వైలెంట్ గానే ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. అణచివేత అనే హింసను ప్రతిఘటిస్తూ…వాడు రెచ్చిపోతే….వాడు రాక్షసుడు అవుతాడు. వాణ్ణి చంపిన వాడు ఆటోమేటిగ్గా దేవుడు అవుతాడు. దేవుణ్ణి మనం ఏమన్నా అంటే…కళ్లుపోతాయి. అసలు దేవుడిదే రివేంజ్ డ్రామా. నూరు తిట్లు తిట్టే దాకా వెయిట్ చేసి ప్రజాభిప్రాయం వాడికి వ్యతిరేకంగా మోటివేట్ అయ్యేదాకా వెయిట్ చేసి మరీ చక్రమేసి శిశుపాలుడ్ని చంపేసిన రివేంజ్ టెక్నిక్ దేవుడిది. పెట్టుబడి దాని ఇష్టానుసారం ఎవర్నైనా సరే వాడేసుకుంటుంది. ఎవరూ కిమ్మనకూడదు. ఎవడైనా తోక ఝాడిస్తే…తక్షణం వాడిని రాక్షసుడుగా ప్రచారం చేస్తాం. దైవం వాణ్ణి శిక్షిస్తుంది. దైవత్వం నిండిన ప్రజలందరూ మిఠాయిలు పంచుకుంటారు. పండగ చేసుకుంటారు.
వెంపటాపు సత్యం చనిపోయినప్పుడు నరకాసుర వధ అని ఓ పత్రిక హెడ్డింగ్ పెట్టింది. ఆ పత్రికకు దైవం మీద ఎంత విశ్వాసమో?

ఎవడి బతుకు వాడ్ని బతకనిస్తే…గొడవలెందుకొస్తాయి. ప్రతోడు పెద్దన్న అనిపించుకునే ప్రయత్నాలకు దిగడంతో వస్తున్న సమస్యలే ఇవి. శిక్షలతో నేరాలు
తగ్గవు. శిక్షలతో మానసిక పరివర్తన రాదు. పెట్టుబడి అసమానతలను పెంచుతుంది. అసమానత జనంలో అసహనాన్ని పెంచుతుంది. అది నిరసన రూపం
తీసుకుంటే అనివార్యంగా హింసాత్మకం అవుతుంది. అలా ఎవడూ తలెగరేయకుండా చూసుకునేందుకు బలమైన పోలీసులు ఉండాలి. బలమైన శిక్షలు అమలవ్వాలి.

పెట్టుబడి అభిప్రాయాలను ప్రజలకు అలవాటు చేసే మీడియా ఉండాలి. మీరు మమ్మల్ని కొట్టారు కాబట్టి మేం మిమ్మల్ని చంపుతాం…అంటే..కాదు మీరే ముందు మమ్మల్ని చంపారు..ఆ తర్వాతే మిమ్మల్ని మేం చంపుతున్నాం. అని మనుషులు రెండు గ్రూపులుగా క్లెయిమ్ చేసుకునే పరిస్ధితి ఇప్పటికే అలవాటు చేసేశారు. సైన్స్ విస్తరిస్తే…దేవుడి ప్రభావం తగ్గాలి. మతాలు కనుమరుగవ్వాలి. కానీ పెట్టుబడి అలా ఒప్పుకోదు. సైన్స్ జీవిన విధానం కానివ్వదు.

సినిమా తీసిన నిర్మాత తన ఫిల్మ్ బాక్స్ తోనూ…రోదసిలోకి శాటిలైట్ ఉపగ్రహాలు పంపే శాస్త్రవేత్త తను చేయబోయే ప్రయోగానికి సంబంధించిన డాక్యుమెంట్లతోనూ తిరుపతికి వెళ్లడం మనకు తెల్సు.

జనాన్ని ఒక్కటిగా కలవకుండా చేయడానికి ఉన్న ప్రతొక్క విభజననూ వాడుకుంటుంది. సజీవంగా ఉండేలా చూసుకుంటుంది. పోషిస్తుంది. గుజరాత్ నమూనా అదే. గోద్రా మారణకాండ ఇప్పుడు దేశ నాయకత్వం స్వీకరించకతప్పదనే డిమాండ్ పెరుగుతోంది. దైవం గుజరాత్ లో వెలిసింది. దాన్ని ఢిల్లీ గద్దె మీద కూర్చోపెట్టేస్తే….ఇక ఏ నిర్ణయమైన కఠినంగా తీసుకుంటారు. అంతా సెట్ రైట్ అవుతుందనే దైవానుకూల ఒపీనియన్ ప్రజల్లో నింపుతున్నారు.

ఎవరు ఎవర్ని చంపడంతో ఈ చంపుడు పందెం ప్రారంభమైందో చెప్పలేనంత పురాతన మైంది ఈ నరమేథం. ప్రతి హత్యకూ ఒక రీజనింగ్ ఉంటుంది. ప్రతి
హత్యకూ ఒక స్పష్టమైన కారణం ఉంటుంది. ప్రతి హత్యా ఒక ప్రయోజనం కోసమే జరుగుతుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు…పరోక్షంగానూ కావచ్చు. రాజ్యం
చేసిన కొన్ని హత్యలకు ప్రతీకారంగా కసబ్ అండ్ కో ముంబైని టార్గెట్ చేశారు. అఫ్ఝల్ గురు అండ్ కో పార్లమెంటు మీద దాడికి దిగింది. ఆ నేరాలకుగాను ప్రభుత్వం సీరియస్ గా ఇద్దరినీ అరెస్ట్ చేసి చంపాలనే కోరిక ప్రజల్లో కలగించి..దాన్ని ఒక డిమాండ్ గా బయటకు తెచ్చి ఉరితీసింది. దీనికి ప్రతీకారంగా హైద్రాబాద్ లో బాంబులు పేలాయి. ప్రతీకారం ప్రతీకారాన్నే కోరుకుంటుంది. ప్రతీకారం ద్వారా సాధించేది ప్రతీకారమే. కత్తి పట్టిన వాడు కత్తితోనే
చస్తాడు అని ఊర్కెనే అన్నారా మన పెద్దోళ్లు. రివేంజ్ డ్రామా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నువు చంపావని చంపేస్తావని నిన్నే చంపేస్తా…అని ఒకడు
పాడితే..చంపావనుకుని చంపేస్తావనుకుని నేనూ చంపేశా అని మరోడు పాడుతున్నాడు.


Comments are closed.