Featured News

రాజకీయ నాయకుల వాళ్ల ఒరిగేదేమీ లేదు. ప్రజలే చర్చించుకొని తెలంగాణా పై నిర్ణయం తీసుకోవాలి.

రాజకీయ నాయకుల వాళ్ల ఒరిగేదేమీ లేదు. ప్రజలే చర్చించుకొని తెలంగాణా పై నిర్ణయం తీసుకోవాలి.

రాష్ట్రం అగ్నిగుండం లా మండిపోతోంది. గత సంవత్సరంగా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. సమైఖ్యాంధ్ర కావాలి, తెలంగాణా కావాలి అని అని ఉద్యమం చేస్తున్న నాయకులకు ఒక చిన్న ప్రశ్న. రాష్ట్రం ఎదుర్కుంటున్న ఈ సమస్య ను ఒక నిత్య జీవిత సమస్య తో పోల్చి చూద్దాం. ఒక భార్య, భర్త మనస్పర్ధలు వచ్చి విడిపోవాలి అనుకుంటున్నారు అనుకోండి. భార్య భర్త మీద విడాకుల కేసు వేసిందనుకోండి. విడిపోవడం ఇష్టం లేని భర్త ఏమి చేస్తాడు. మేము విడిపోము అని తిరిగి కేసు వేస్తాడా లేక మనస్పర్ధలు తోలిగించుకునేందుకు ప్రయత్నిస్తాడా? నీతో బతకడం ఇష్టం లేని భార్య నువ్వు విడిపోము అని కేసు వేస్తే తిరిగి వస్తుందా లేక అపార్ధాలు తోలిగించుకునేందుకు ప్రయత్నించి, వీలైతే మధ్యవర్తులను, పెద్దవాళ్ళతో చెప్పిస్తే మాట వింటుందా? మరి తెలంగాణా విషయం లో ఈ నాయకులు చేసినది ఏమిటి? మీతో కలిసి ఉండడం వద్దో అంటున్న తెలంగాణా వాళ్ళకు వ్యతిరేకం గా కలిసే ఉంటాము అని ఉద్యమం ప్రారంబించారు. మరి ఉద్యమం చేస్తే ఇష్టం లేని వాళ్ళు కలిసి ఉంటారా. ప్రభుత్వం మరోలా నిర్ణయం చెయ్యచ్చు. ఏ నిర్ణయం అయినా మనస్పర్ధలు ఇంకా పెంచేందుకే పని చేస్తాయి. మరి నిజంగా కలిసి ఉండేందుకే ఇష్టపడితే ఏమి చెయ్యాలి? తెలంగాణా వాళ్ళతో చర్చలు జరపాలి. ఒక అడుగు కిందికి దిగి అయినా ఒప్పించాలి. అలాంటి ఒక్క ప్రయత్నం అయినా జరిగిందా?

నిజం చెప్పాలంటే తెలంగాణా ఉద్యమం కాని సమైఖ్యాంధ్ర ఉద్యమం కాని ప్రారంభం అయింది ఒక రాజకీయ ఉద్యమంగానే. రాజకీయ నాయకులు ప్రేరేపించగా విద్యార్ధులు, గురువులను ముందుకు నెట్టి నాయకులు ప్రారంబించిన ఉద్యమాలే. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా ఇది నిజం. కాని తెలంగాణా లో ప్రత్యేక తెలంగాణా పై మొదటి నుండి ఉన్నా సెంటిమెంట్ కారణంగా, సమైక్యాంధ్ర ఉద్యమం బూచి చూపి తెలంగాణా నాయకులు రాజకీయ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడం లో సఫలం అయ్యారు. అదే సీమాంధ్ర నాయకులు తమ ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా మార్చలేకపోయారు. సీమాంధ్ర నాయకుల అసమర్ధతను తెలంగాణా నాయకులు సీమాంధ్ర ప్రజలు తెలంగాణా పై చూపుతున్న వివక్ష కు తార్ఖానంగా చూపి మనసులను విభజించారు. ఎందుకు కలిసుండాలో చెప్పడం కంటే ఎందుకు విడిపోకూడదో తెలంగాణా ప్రజలకు చెప్పే ప్రయత్నం అసలు జరగలేదు. ఇక్కడ సమైఖ్యాంధ్ర మంచిదా, తెలంగాణా మంచిదా అన్న వాదానికి నేను వెళ్ళడం లేదు. ప్రజల మధ్య మాటలు ఉంటె రాజకీయనాయకులు తమ స్వార్ధంతో ప్రజలను విడదీసే పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ అవునన్నా, కాదన్న అసలు సమస్య హైదరాబాద్ నగరమే అనడం అతిశయోక్తి కాదు. రాష్ట్రం నలుమూలనుండి వచ్చి హైదరాబాద్ నగరం లో ఉద్యోగం, వ్యాపారం చేసి స్థిరపడిన ప్రజలు ఆందోళన పడ్డ మాట వాస్తవమే. కలిసుంటాము అనేకన్నా హైదరాబాద్ గురిచి తేల్చండి తెలంగాణా ఓ కే అని ఉంటె ఒక చర్చ కు మార్గం ఏర్పడేది. హైదరాబాద్ గురించి తెలంగాణా వాదులు కూడా వితండవాదం చెయ్యడం బాగాలేదు. రాష్ట్ర రాజధాని కాబట్టి ఎవరైనా పెట్టుబడులు పెడతారు.అది ప్రపంచం లో ఎక్కడైనా జరిగేదే. అలాంటి పెట్టుబడులను దోపిడి అనడం కచ్చితంగా తప్పే. ప్రపంచం లో ఏ నగరం అయినా పెట్టుబడులతోనే అభివృద్ధి చేధాయి అనడం నిజం. ఈ రోజు పెట్టుబడిదారులను దొంగలు అంటే రేపు రాష్ట్రం వస్తే ఎవరు పెట్టుబడి పెడతారు అనేది ఆలోచించాలి. ఈ రోజు మహారాష్ట్ర లో కానివ్వండి, బెంగళూరు లో కానివ్వండి…సీమాంధ్ర వాళ్ళు, తెలంగాణా వాళ్ళు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చెయ్యడం లేదా? మరి అక్కడి నుండి మనల్ని వెళ్ళిపోమని అంటే మనం ఏమి చేస్తాము? కేవలం రాజకీయనాయకుల ప్రోద్బలం వల్లనే మనుషుల మధ్య విబెదాలనే ముళ్ళ కంచెలను పెంచుతున్నారు.

ఈ రోజు కూడా ఈ ఉద్యమాలు రాజకీయనాయకులవే. ప్రజలకు ఒకరంటే మరొకరికి ద్వేషాలు లేవు. ఉద్యమాలు జరుగుతున్నాయని సీమాంధ్ర తెలంగాణా ప్రజల మధ్య పెళ్ళిళ్ళు జరగడం లేదా లేకపోతే పెళ్లి చేసుకున్నవాళ్ళు విడిపొతున్నారా? లేదే..మరి ఒకే బాష మాటలడుతున్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య విబేధాలు పెందుతున్న నాయకులకు ఎందుకు జవాబు చెప్పడం లేదు ప్రజలు. రాష్ట్రం రాగానే జాతకం మారుతుంది అనుకోవడం నా దృష్టి లో అమాయకత్వం. రేపు రాష్ట్రం వచ్చినా నాయకులు వీళ్ళే కదా? మరి గత అరవై ఏళ్ళ నుండి పదవుల్లో ఉంది ఏమి చెయ్యని నాయకులు రేపు రాష్ట్రం రాగానే అభివృద్ధి చేస్తారా? ఇంతవరకు సీమాంధ్ర నాయకుల వాళ్ల అభివృద్ధి చెయ్యలేదు అంటారా..మరి నాయకుడు అభివృద్ధి కి అడ్డుపడుతుంటే రాజీనామా విసిరికొట్టి రావచ్చు కదా..మరి ఎందుకు చెయ్యలేదు? పదవులు ఇస్తూనే మాట ఎందుకు మార్చారు. ఏ నాయకుడైనా ప్రతిపక్షం లో ఉంది మళ్లీ ఎన్నికలో గెలవను అనుకుంటేనే రాజీనామా చేసాడు తప్ప ఆత్మాభిమానం తో కాదు. మరి ఇలాంటి నాయకులు మన బతుకులు మారుస్తారనుకోవడం అతిశయోక్తి కాదా? ఒకరితో ఒకరు చర్చించకుండా ఉద్యమాల పేరుతో బస్సులు, రైళ్ళు దగ్ధం చేసుకుంటూ ఆస్తులు నష్టం చేసుకుంటే ఎవరికీ లాభం. రేపు రాష్ట్రం వస్తే ఇదే నాయకులు ఆ నష్టాలను పన్నుల పేరుతో చెవులు పిండి వసూలు చేస్తారు.

కాబట్టి మిత్రులారా..మనం ఒక విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. మనల్ని అరవై ఏళ్ళుగా ఏలుతున్న ఈ నాయకులు ఇప్పుడు కొత్తగా మంచి చేసేది ఏమి లేదు. మాట్లాడుకొని ఒక ఇంట్లో సోదరుల వలె కాస్త అటు ఇటు గా మాట్లాడుకొని ప్రజలే నిర్ణయం చేసుకోవాలి.

by Brahma Mahesh
khaderbad@gmail.com


Comments are closed.