Featured News

డబ్బెవరికి చేదు? నోట్లకు వోట్లు- మనకు ఇది కొత్తా?

డబ్బెవరికి చేదు? నోట్లకు వోట్లు- మనకు ఇది కొత్తా?

పార్లమెంట్ లో మళ్లీ దుమారం చెలరేగింది. యు పీ ఏ ప్రభుత్వానికి ఒక గండం తరువాత మరో గండం ఎదురు అవుతోంది. 2 జీ స్కాం నుండి ఎలా బయటపడాలో అని సతమతం అవుతున్న ప్రభుత్వానికి వికిలీక్స్ రూపం లో సరికొత్త సమస్య ఎదురయింది. యు పీ ఏ ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయం లో వోట్ల కోసం నోట్లు ఇచ్చిందని ఆరోపణ. ఇంతకు ముందే ఈ విషయం పై పార్లమెంట్ లో గందరగోళం సృష్టించిన బి జే పి కి ఈ దుమారం చాలా కలిసొచ్చింది. ఈ విషయం పై నా ప్రశ్న ఒకటే- మనకు నోట్లకు వోట్లు కొత్తా ? ఇందుకు మనకు వికిలీక్స్ అవసరమా ?

ఈ దేశం లో ప్రతి చిన్న ఎన్నిక నుండి పెద్ద ఎన్నిక వరకు నోటు విధల్చనిదే ఓటు రాలదనే విషయం అందరికి తెలుసు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఖర్చు లక్షలు ధాటి కోట్లు చేరిందన్న విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు. ఎన్నికల సమయం లో డబ్బు, వస్తు రూపం లో ఓటర్లను ప్రలోభ పెడతారన్న నిజం ఎవరికీ తెలియదు? అయినా ఎవరు ఒప్పుకోరు..బయటకు చెప్పారు . ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసే ఎన్నికల ఖర్చుల సూచిక అసలైన వ్యయానికి పదిశాతం కూడా ఉండదు. కాని ఏ ఎన్నికల అధికారి గాని ఇంకెవరు కాని ప్రశ్నించరు. ఎన్నికలు వస్తే అందరికంటే ఎక్కువగా ఆనందించేది ప్రజలే ఎందుకంటే డబ్బు అందుతుందని. పోలింగ్ ముందు రోజు రాత్రి సారా సీసాలు, చీరలు, పోలింగ్ రోజు న్యూస్ పేపర్ లో నోట్ల కవర్లు సర్వ సాధారణం అయిన ఈ సమయం లో వోట్ల కోసం నోట్లు అసలు ఎందుకు పెద్ద సమస్యగా చిత్రిస్తున్నారో అసలు అర్థం కావడం లేదు? కేవలం ప్రజాప్రతినిధులు ఇందులో ఇంవోల్వ్ అయ్యారని ఇది పెద్ద సమస్య గా చూపిస్తున్నారా ? లేకపోతే ప్రభుత్వం ఇరుకున పడిందని ప్రతి పక్షం దీనిని ఒక సమస్య గా చూపిస్తోందా?

అప్పుడెప్పుడో పీ వీ ప్రధాని గా ఉన్నపుడు జే ఏం ఏం ఎంపీలను కొన్న ఉదంతం లో అప్పుడే మన ప్రజాస్వామ్యం సిగ్గుపడలేదా? ఈ మధ్య ఆంధ్ర ఎం ఎల్ సి ఎన్నికలలో ప్రజా ప్రతినిధులు వోట్ల కోసం నోట్లు అడిగి దేశం తలదించుకునేలా ప్రవర్తించ లేదా? మరి బీ జే పీ కర్ణాటక లో సింహాసనం నిలబెట్టుకునేందుకు చేస్తున్నది ఏమిటి? దానికి సమాధానం ఏమిటి? మన దేశం లో రాజకీయాలలో జరుగుతున్న బాగోతం ఎవరికీ తెలియదని మీడియా, ప్రతిపక్షాలు ఎందుకు ఇంత హుంగమ చేస్తున్నాయి?

అప్పుడెప్పుడో రాష్ట్రం లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు టీ వీ లో చూపిస్తున్నపుడు ఒక సాధారణ మనిషి ని అడిగాను ఈ ఆరోపణలు నువ్వు నమ్ముతావా అని? ఆయన సమాధానం- రాజకీయాలలో ఎవరు సంపాదించడం లేదు సర్ ? అలాగే వై ఎస్ కూడా తిని ఉండొచ్చు కాని కనీసం మా కోసం ఏవో చేస్తున్నాడు కదా అని. ఈ రోజు ఎక్కడో చదివాను తమిళనాడు లో 2 జీ స్కాం ఏమాత్రం ప్రభావం చూపడం లేదని. కరుణానిధి కే సామాన్య పౌరుడు వోటు వేసేందుకు సిద్ధంగా ఉన్నాడని. 2007 లో auto పెర్మిట్ ఇచ్చాడు. 2008 లో ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు. వచ్చే సంవత్సరం నుండి మెడికల్ ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తాడు. నాకోసం ఇన్ని చేసినప్పుడు అసలు కరుణానిధి ఆయన కుటుంబం ఎన్ని కోట్లు తింటే మాత్రం నాకు ఏమిటి సమస్య అన్నాడట ఆ పేపర్ మాట్లాడిన మనిషి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2 జీ స్కాం లో 1 ,76000 కోట్లు రాజా, డీయంకే తిని ఉంటె ఈ సారి వాళ్ళు వోటుకు ఎక్కువ డబ్బు ఇవ్వాలి లేదంటే వోటు వెయ్యను అన్నాడట ఒక పౌరుడు. ఈ రోజు పదిమందిలో తొమ్మిది మంది ఇలాగే మాట్లాడతారు . ఎందుకంటే ఈ దేశం లో చదువుకున్నవాడు వోటు వెయ్యడు. చదువులేని వాడి దగ్గర లేని డబ్బు ఇస్తే దేశం గురించి ఆలోచించాడు. మరి ఇలాంటి పరిస్తుతలో మనం మన నేతలను తప్పుపట్ట గలమా ? ఒక ఎం ఎల్ ఏ అవ్వాలంటే 10 కోట్లు, ఎం పీ అవ్వాలంటే కనీసం 20 కోట్లు ఖర్చు అవుతున్న ఈ రోజులలో గెలిచినా నేతలు ఖర్చు రాబట్టుకోవాలి అనుకోవడం తప్పు కాదు కదా? అందుకే అవకాశం వచ్చినప్పుడు తమను తాము అమ్ముకొని సంపాదిస్తుంటారు నేతలు. టీ వీ లో న్యూస్ చూసి పాప్ కార్న్ నములుతూ దేశాన్ని తిట్టే మధ్య తరగతి వాళ్ళలో ఎంత మంది ఎన్నికల అప్పుడు వోటు వేస్తారు? వోటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోని పౌరుడికి ప్రశ్నించే అధికారం ఉందా అన్నది నా ప్రశ్న. నేను నోటుకి వోటు ని సమర్ధిస్తున్నానని అనుకోవద్దు. నా ఉదేశ్యం మనం మారనిదే మన నేతలు మారరు. మన నాయకులే ఇలా ఉన్నారు మనం ఎంత అనుకోకూడదు . మనము నిజాయితీ ఉంటేనే మన నాయకులను ప్రశ్నించే అధికారం, ప్రశ్నించాగలిగే దమ్ము వస్తాయి. యదా రాజ తదా ప్రజా అన్న పాత నానుడి ఈ రోజులలో పని చెయ్యదు. యదా ప్రజా తదా రాజ అన్నదే ప్రజాస్వామ్యం లో సరైన మాట

by Brahma Mahesh
khaderbad@gmail.com


Comments are closed.