Featured News

ప్రజల జీవితాలతో నాలుస్తంబాలాట ఆడుతున్న నాయకులు

Lack of Leadership

Lack of Leadership- A bane in the democracy


చిన్నపుడు నీతి కోసం మా అమ్మమ్మ ఒక కథ చెప్పేది. దాని సారాశం ఏమిటంటే ఒక తప్పు లేదా అబద్ధం చెపితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చెయ్యాలి. అబద్దం మీద అబద్దం చెప్పాలి అని. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే ఆ కథ నిజం అనిపిస్తుంది. పోయినేడాది డిసెంబర్ తొమ్మిదిన ఒక ముప్పునుండి తప్పించుకోబోయి తెలంగాణా ఇస్తామని చెప్పిన చిదంబరం గారు, సోనియమ్మా ఆ తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక ఆ పద్మవ్యూహం లోంచి బయట పాడేందుకు చేస్తున్న యుద్ధం లో సమిధలు మాత్రం ప్రజలే అవుతున్నారు. ఈ సంవత్సర కాలం లో రాష్ట్రం లో చాలా ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. నా చిన్నపటి నుండి అసెంబ్లీ లో, పార్లమెంట్ లో అధికారపక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ధర్నాలు చెయ్యడం, వ్యతిరేకించడం చూసాము. కాని ఈ రోజు బ్రహ్మంగారు చెప్పిన కలికాలం వచ్చిందన్న సత్యం నిజమయ్యిందేమో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలకు ధర్నాలు చేసే ఛాన్స్ అసలు ఇవ్వట్లేదు. ప్రతిరోజు పార్లమెంట్ లో, అసెంబ్లీ లో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి. మరి వీళ్ళ ధర్నాలు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కదా అని నా ప్రశ్న? ఎక్కడైనా స్వంత పార్టీ వాళ్ళు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చెయ్యడం చూసారా? అంత ధర్నాలు చేసినా తమ గోడు పట్టించుకోని తమ ప్రభుత్వాన్ని ఈ నిజాయితీ పరులు, తెలంగాణా భక్తులు ఇంకా ఎందుకు భరిస్తున్నారు? అంత స్వాభిమానం ఉన్న వాళ్ళయితే రాజీనామా పత్రం ఎందుకు విసిరి వెయ్యడం లేదు? ఈ రాష్ట్రం లో చిన్నపిల్లాడి మనసులో కూడా ఇదే ప్రశ్న?


ఇక ఉద్యమ పార్టీ గా చెప్పుకునే తెరాస గురిచి చెప్పాలంటే చాలానే ఉంది. వాళ్ళ నాయకుడు గత ఆరేళ్ళ నుండి తెలంగాణా ఇయ్యాల,రేపు అంటాడు కాని రాదు. రాజీనామాల మీద రాజీనామాలు చేయిస్తాడు మళ్లీ పోటి చేస్తాడు. దానివల్ల పలితం శూన్యం. ఇక చూడండి నా సత్తా అంటాడు, సైలెంట్ అయిపోతాడు. మాది ప్రజాస్వామిక ఉద్యమం అంటాడు, మంత్రులను, ఏం ఎల్ ఏ లను కొడుతుంటే మాట్లాడాడు. మళ్లీ ఏమంటే అసలు కొట్టనే లేదు అంటాడు. ఆ దృశ్యాలు టీవీ లో వచ్చినా ధైర్యంగా తన కొడుకు, అల్లుడు ద్వారా అవన్నీ అబద్దం అని చెప్పించగల సామర్ధ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటాడు కాని ఎదుటి వాడు తన అభిప్రాయం చెపితే దద్దమ్మ అంటాడు, ఆయన పార్టీ వాళ్ళు బెదిరిస్తారు. ఈ దేశాన్ని,రాష్ట్రానికి,జాతికి,బాషకు ఎంతో సేవ చేసిన మహాత్ముల విగ్రహాలు ద్వంసం చేస్తుంటే కిమ్మనడు. మరి రేపటి నుండి తెలంగాణా లో ఏ ఇంట్లో కూడా అన్నమయ్య కీర్తనలు, నన్నయ్య మహాభారతం అసలు వినకూడదు అని హుకుం జారి చెయ్యమని చెప్పండి. క్రిష్ణదేవయరాయలు తెలంగాణా తో సహా దక్షిణ భారతదేశాన్ని పాలించాలేదా? మరి ఆయన ఏ పాపం చేసాడు? ఆయనను కూడా వలసవాది అంటారా? ఒక్కవిషయం గుర్తు ఉంచుకోవాలి. కరీంనగర్ జిల్లా వాడు నిజామాబాద్ వెళితే వలసవాది అవుతాడు. నిజామాబాద్ వాళ్ళు మహబూబ్ నగర్ వెళితే వలసవాదులు అవుతారు. ఎప్పుడైతే ఉద్యమం లో ద్వేషం, హింస ఉంటాయో అప్పుడు ఉద్యమానికి అర్థం లేదు. నేను తెలంగాణా కు వ్యతిరేకం కాదు. తెలంగాణా ఇస్తే అది భారతదేశం లో భాగమే కాని పాకిస్తాన్ లో భాగం కాదు కదా? కాని ఉద్యమం నడిపే పద్ధతే బాగా లేదు. ఏ రోజైనా నాయకులూ తప్ప ప్రజలు ఎవరైనా ఉద్యమం తప్పని ధర్నాలు చేసారా? అలాగే తెలంగాణా లో సామాన్య ప్రజలు రాళ్ళు విసిరారా? ప్రజల మధ్య ద్వేషం పెంచి రాష్ట్రం కావాలంటే వస్తుందా? రేపు ముంబై లో, భివండి లో ఉన్న తెలంగాణా వాళ్ళపై అక్కడి వాళ్ళు దాడి చేస్తే ఎలా ఉంటుంది? హింసాత్మక ఆందోళనలు చేసి రాష్ట్రం సాదించినా రాష్ట్రం లో పరిశ్రమలు వస్తాయా? తమ ఎవరు మాత్రం రిస్క్ లో పెడతారు? ఉదాహరణ తీసుకోండి. మీ ఇంట్లో ఎక్కడో ఎవరో ఒక గొడవ లో భాగం అయ్యారనుకోండి. మీ ఇంటికి వచ్చే పెల్లివాళ్ళు వీళ్ళతో ఎందుకు అనుకోరా? అసలు ఏమి నిరూపిద్ధామని వీళ్ళ ఆరాటం? ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సీమంధ్ర కుటుంబం లో ఒక తెలంగాన బంధువు ఉంటారు, ప్రతి తెలంగాణా ఇంట్లో సీమంద్ర రక్తం ఉంటుంది. సోదరుల మధ్య విద్వేషాలు ఎక్కడి దారి తీస్తున్నాయి?


ఆరేళ్ళ క్రితం ఒక మనిషి గురించి గర్వపడిన రోజులు ఉన్నాయి. ఒక గోప్పనేత గా ప్రపంచం అంతా పొగుడుతుంటే మన తెలుగువాడు అని రోమాలు నిక్కబోడుచుకున్న క్షణాలు ఉన్నాయి. ఆ నాయకుడే చంద్రబాబు. అలాంటి నాయకుడు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోకుండా, సమస్య ను చూసి పారిపోతున్న వైనం నివ్వెరపరుస్తోంది. నాయకత్వం అంటే ఇదేనా అని నా నమ్మకాన్ని వెక్కిరిస్తోంది. రెండు ప్రాంతాల నాయకులు తన ముందే తిట్టుకున్నా చలనం ఉండదు. రోడ్డుమీద ఇద్దరు తెలియని వాళ్ళు గొడవ పడితేనే మనం విడదీసి రాజి చేస్తామే..మరి ఈ నాయకుడు తన తెలుగు తముళ్ళ మధ్య అగ్గిరాజేసి ఆనందిస్తున్నాడు ఎందుకు? నాయకత్వానికే ఉదాహరణ గా నిలిచినా నేత ఈ రోజు నాయకత్వ లేమి ఉదాహరణ గా నిలుస్తున్నాడు.


రోమ్ నగరం మంటల్లో ఉంటె ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిని నేను చూడలేదు కాని ఈనాటి సీయం కిరణ్ కుమార్ రెడ్డి చూస్తే నీరో ను తలిపిస్తున్నాడు. ఆయన కాబినెట్ లో మంత్రులు మాట వినరు. ఆయన పార్టీ నాయకులే ఆయనను ఖాతరు చెయ్యరు. నిన్న ట్యాంక్ బండ్ పై గొడవ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంటెలిజేంస్ వైఫల్యం ఉన్నా ఒప్పుకోరు, తప్పుకోరు. అంతా బాగుందని చంకలు గుద్దుకుంటారు. ఇదేమి నాయకత్వామో, ఇదేమి ప్రభుత్వమో అర్థం కాదు. ప్రజల మంచి చూడాల్సిన నేతలు నిద్రపోతున్న విడ్డూరం ఈ రోజు చూస్తున్నాము. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనిపిస్తుంది. నాయకత్వ లేమి ఎంత భయంకరంగా ఉంటుందో తెలియజేస్తోంది.


రాష్ట్రం ఇలా తగలబడుతూ ఉంటె తన రాజకీయ భవిష్యత్తు కోసం యాత్రలు చేస్తున్న మరో నాయకుడు జగన్. నిజమైన నాయకుడు ఆపద వచ్చినపుడు ఆదుకుంటాడని నమ్మిన సిద్దాంతాన్ని అస్సలు నమ్మని ఈ నాయకుడు సమస్య పరిష్కారం దిశగా దిశానిర్దేశం చేసి ఉంటె నిజమైన నాయకుడని అనేవాళ్ళు. కాని ఆయన తన యాత్రలలో బిజీ గా ఉన్నారు.

ఇలా చుట్టూ తమ తమ స్వార్దాలతో రాజకీయాలు నడుపుతున్న ఇలాంటి నాయకుల మధ్యలో నష్టపోతున్న సామాన్య మానవుడి గోడు వినేదెవ్వరు? ఈ కష్టాలకు అంతు ఎప్పుడు?

by Brahma Mahesh
khaderbad@gmail.com


Read another article by Brahma Mahesh
Lack of Leadership- A bane in the democracy


Comments are closed.